కాబుల్: తాలిబన్ ( Taliban ) ఫైటర్లు ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి అమెరికా బలగాలు వెనక్కి తగ్గిన తర్వాత తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. దీనిపై అమెరికా ఇంటెలిజెన్స్ ఓ అంచనా వేసింది. 30 రోజుల్లోగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్ ఫైటర్లు చుట్టుముట్టేస్తారని, ఇక 90 రోజుల్లో ఆ నగరాన్ని ఏకంగా హస్తగతం చేసుకోగలరని ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. అయితే ఆఫ్ఘన్ సేనలు ధీటుగా తిప్పికొడితే.. అప్పుడు ఉగ్రవాదుల వేగాన్ని అడ్డుకోవచ్చు అని యూఎస్ ఇంటెలిజెన్స్ చెప్పింది. ప్రస్తుతం ఆఫ్ఘన్లో 65 శాతం ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధీనంలోకి వచ్చేసింది. మరో 11 ప్రావిన్సులను తమ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు తాలిబన్ల హెచ్చరికలు కూడా చేశారు. ఉగ్రపోరులో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్ఘన్ దళ సభ్యుల మృతదేహాలు కాందహార్‌కు భారీ సంఖ్యలో వస్తున్నట్లు స్థానికులు చెప్పారు. గాయపడ్డ తాలిబన్ ఫైటర్లు కూడా చికిత్స కోసం ఆ నగరానికి వెళ్తున్నారు. కాందహార్‌లో ఫైటింగ్ బీకరంగా ఉందని, నిత్యం రాకెట్ల దాడి జరుగుతున్నట్లు చెబుతున్నారు. సాధారణ పౌరులను ఏమీ అనడం లేదని తాలిబన్లు ప్రకటించారు.