Taliban Bans Chess | తాలిబన్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకున్నది. తమ దేశంలో చెస్ ఆడడంపై నిషేధం విధించింది. ఇప్పటికే పలు రకాల క్రీడలను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని ఖామా ప్రెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. మే ఒకటి నుంచి చెస్‌ని నిలిపివేస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ధ్రువీకరించింది. గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ధర్మ ప్రచారం, దుర్మార్గ నివారణ చట్టం కింద బ్యాన్ విధిస్తున్నట్లు స్పోర్ట్స్ డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ పేర్కొన్నారు. చెస్ జూదానికి మూలంగా పరిగణిస్తున్నామని.. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించే వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
అప్పటి వరకు చెస్ సంబంధిత కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. తాలిబన్ల ధర్మం ప్రచారం, దుర్మాగ నివారణ మంత్రిత్వ శాఖ సైతం ఆఫ్ఘనిస్తాన్ చెస్ సమాఖ్యను రద్దు చేసింది.. ఇస్లామిక్ చట్టం చెస్‌ను ‘హరామ్’ (నిషిద్ధం)గా ప్రకటించిందని ఖామా ప్రెస్ నివేదించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ఆంక్షలు పెరుగుతున్నాయి. తాలిబన్ నిషేధం ప్రకటనకు ముందు అనేక మంది చెస్ ఆటగాళ్లు, చెస్ సమాఖ్య అధికారులు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు తాలిబన్ నేతృత్వంలోని క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి, ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాలిబన్ సర్కారు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. నిషేధం విధించింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో సాంస్కృతిక, వినోద కార్యకలాపాలను పరిమితం చేయడానికి వారి వ్యూహాన్ని చూపిస్తుంది.
తాలిబన్లు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. ఈ విధానాలు ఎంతకాలం కొనసాగుతాయో చూడాల్సిందే. అయితే, తాలిబన్ సర్కారు నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజం నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తుందా? లేదా చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో విద్యార్థులకు కొత్త యూనిఫారం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు బ్లూ కలర్ చొక్కాలు, ప్యాంటు, తెల్లటి టోపీలు ధరించాలని చెప్పింది. 10 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు తెల్ల చొక్కాలు, ప్యాంటు, తెల్లటి తలపాగాలు ధరించాలని చెప్పింది. ఆరో తరగతి వరకు విద్యార్థులకు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించాలని ఆదేశించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబన్లు ఆరో తరగతి కంటే ఎక్కువ చదువుకోవడాన్ని తాలిబన్లు నిషేధించారు. విశ్వవిద్యాలయాలు, వైద్య విద్య అందకుండా చేసింది. అలాగే, మహిళలు క్రీడలు ఆడకూడదంటూ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.