న్యూఢిల్లీ: సిరియా అధ్యక్షుడు బాషర్ అసద్(Bashar Assad)కు.. రష్యా ఆశ్రయం కల్పించింది. అతను మాస్కో చేరుకున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి. హయత్ తాహ్రిర్ అల్ షామ్ జిహాదీలతో పాటు ఇతర ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాదులు శనివారం దేశ రాజధాని డమస్కస్లోకి ప్రవేశించాయి. ఆ ఉగ్రదళాలు దేశ రాజధానిని నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. సిరియా అధ్యక్ష పదవి నుంచి బాషర్ అసద్ తప్పుకున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ద్రువీకరించింది. ఇస్లామిక్ దళాలతో జరిపిన చర్చల తర్వాత సిరియా అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లినట్లు కూడా రష్యా కన్ఫర్మ్ చేసింది.
అసద్‌తో పాటు ఆయన కుటుంబం కూడా మాస్కో చేరుకున్నట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి సహకరిస్తామని సిరియా ప్రధాని మోహమ్మద్ అల్ జలాలీ తెలిపారు. ఆల్‌ఖయిదా మాజీ కమాండర్ జాబత్ అల్ నుస్రా నాయకత్వంలోని హెచ్‌టీఎస్ గ్రూపు.. గత వారం సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్సు నుంచి తీవ్ర దాడులకు దిగింది.
అలెప్పొ, హమా, హోమ్స్, అల్ కుసైర్ నగరాల నుంచి సిరియా దళాలను ఆ జిహాదీలు పారద్రోలాయి. అమెరికా మద్దతు ఇస్తున్న ఫ్రీ సిరియన్ ఆర్మీ.. పురాతన పల్మైరా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.