వాషింగ్టన్, ఏప్రిల్ 25: హెచ్-1బీ వీసా జారీ కార్యక్రమాన్ని మూడేండ్లపాటు నిలిపివేయాలని రిపబ్లికన్ నేతలు అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసాల జారీ వల్ల విదేశీ కార్మికులు చౌకగా అందుబాటులోకి వస్తున్నారని, దీనివల్ల అమెరికా వర్కర్లకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని ఆ బిల్లులో సభ్యులు ప్రతిపాదించారు. అరిజోనాకు చెందిన రిపబ్లికన్ నేత ఎలీ క్రేన్ 2026 హెచ్-1బీ వీసా యాక్ట్ బిల్లును తీసుకొచ్చారు.
ఆయనకు మద్దతుగా మరో ఏడుమంది రిపబ్లికన్ నేతలు బిల్లును సమర్థించారు. హెచ్-1బీ ప్రోగ్రామ్‌లో సంస్కరణలు చేపట్టాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ వీసా పొందాలనుకొనేవారికి ఏడాదిలో కనీస వేతనం రెండు లక్షల డాలర్లు ఉండాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్-1బీ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకురావద్దన్న నియమాన్ని ప్రతిపాదిత బిల్లులో పొందుపర్చారు. లాటరీ సిస్టమ్‌కు బదులుగా వేతనం ఆధారంగా ఎంపిక జరగాలని, హెచ్-1బీ వర్కర్లు మల్టీపుల్ ఉద్యోగాలు చేసే అవకాశం ఇవ్వవద్దని బిల్లులో పేర్కొన్నారు.