Sushila Karki : నేపాల్ తదుపరి ప్రధాని ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. గత రెండు రోజులుకు తాత్కాలిక ప్రధాని అభ్యర్థి విషయమై జెన్ జెడ్ నిరసనకారులు, అధ్యక్షుడితో పాటు సైన్యం మధ్య అవగాహన కుదిరింది. దాంతో.. అందరూ ఊహించినట్టగానే మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి(Sushila Karki) ప్రధానిగా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. సుశీల ఈరోజు రాత్రి 9 గంటలకు తాత్కాలిక ప్రధానికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) ప్రభుత్వం గద్దెదిగిన తర్వాత తాత్కాలిక ప్రధాని పదవికి ముగ్గురు మధ్య పోటీ నెలకొంది. మాజీ జస్టిస్ సుశీల కర్కితో పాటు ఇంజనీర్ కుల్మాన్ ఘిసింగ్(Kulman Ghisingh), ఖాఠ్మాండ్ మేయర్ బలేంద్ర షా(Balendra Shah)లో ఒకరిని ఎంచుకోవడంపై అభిప్రాయబేధాలు తలెత్తాయి. అయితే.. శుక్రవారం సాయంత్రం నాటికి సైన్యం, అధ్యక్షుడు, ఆందోళనకారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మాజీ జస్టిస్ అయిన సుశీలను తాత్కాలిక ప్రధాని చేసేందుకు అందరూ ఆమోదం తెలిపారు.
This is Sushila Karki, formerly the Chief Justice of Nepal,
Who has been unanimously selected by the country’s Gen Zs
To serve as Prime Minister, owing to her firm stance
Against corruption and her commitment to upholding the rule of law. pic.twitter.com/QpxacruKT5
— DP 🇰🇪 (@DanChepta) September 12, 2025
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన మాజీ జస్టిస్ సుశీల కర్కి చరిత్ర సృష్టించనున్నారు. ఆ దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొద్దిమందితో క్యాబినెట్‌ను ప్రకటించనున్నారని సమాచారం. అంతేకాదు ఈరోజు రాత్రే క్యాబినెట్ తొలి సమావేశం జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మీటింగ్‌లోనే ఫెడరల్ పార్లమెంట్‌ను రద్దు చేసే అవకాశముంది.
అవినీతి పాలన, నాయకుల బంధుప్రీతికి తోడూ సోషల్ మీడియాపై నిషేధంపై నేపాల్ యువతరం భగ్గుమంది. ప్రధాని కేపీ ఓలీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 8న శాంతియుతంగా ఆందోళనలకు దిగారు జెన్ జెడ్. అయితే.. పోలీసులు వీళ్లను అణచివేసేందుకు కాల్పులు జరపగా 19 మరణించారు. దాంతో.. ఆగ్రహించిన యువత నిరసనలను హింసాత్మకంగా మార్చాయి. నేపాల్ పార్లమెంట్, సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్ష భవనాన్ని ముట్టించిన ఆందోళనకారులు వాటన్నింటికీ నిప్పు పెట్టారు.