Diabetes | న్యూయార్క్, నవంబర్ 25: ఊబకాయం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుందనే విషయాన్ని అనేక అధ్యయనాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అయితే, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధంపై అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని గుర్తించారు. చిన్న, ఆరోగ్యకరమైన కణాలుగా ఉత్పత్తి చేసేలా కొవ్వు మూలకణాలను ప్రోత్సహించడం ద్వారా మధుమేహానికి చికిత్స అందించే అవకాశం ఉందని తేల్చారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా – లాస్ ఏంజెల్స్(యూసీఎల్ఏ)కు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ అధ్యయన వివరాలు ‘సెల్ రిపోర్ట్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం.. ఊబకాయం వల్ల రైబోసోమల్ ఫ్యాక్టర్స్ అనే కీలకమైన సెల్యూలర్ బిల్డింగ్ బ్లాక్స్‌ను శరీరం సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతున్నట్టు గుర్తించారు.
సరిపడా రైబోసోమల్ ఫ్యాక్టర్స్ లేకపోతే కొవ్వు మూలకణాలు.. పని చేసే కొవ్వు కణాలను ఉత్పత్తి చేయలే వు. ఇది క్రమం గా మధుమేహానికి దారి తీస్తున్నట్టు తేల్చారు. కొవ్వు కణజాలం సరిగ్గా పని చేయనప్పుడు ఆహారం నుంచి వచ్చే శక్తి.. కాలేయం, గుండె వంటి ఇతర అవయవాలకు వెళ్తుంది. దీంతో ఫ్యాటీ లివర్, గుండెజబ్బుల ముప్పు సైతం పెరుగుతుంది. కాబట్టి, కొవ్వు మూలకణాలు.. చిన్న, ఆరోగ్యకరమైన కణాలుగా ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించడం ద్వారా మధుమేహంతో పాటు ఫ్యాటీ లివర్ వంటి జబ్బుల ముప్పును తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మధుమేహ, ఊబకాయం ఉన్న ఎలుకలకు రోసిగ్లిటాజోన్ అనే ఔషధాన్ని ఇచ్చి చేసిన ప్రయోగం సఫలమైనట్టు చెప్పారు.