America Storm | అగ్రరాజ్యం అమెరికాను భీకర తుపాను (America Storm) వణికించింది. పెద్దఎత్తున టోర్నడోలు (tornado) విరుచుకుపడుతున్నాయి. బలమైన గాలుల కారణంగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మిస్సౌరీ (Missouri)లోని బేకర్స్ఫీల్డ్ ప్రాంతంలో టోర్నడో కారణంగా 12 మంది మృతిచెందినట్లు స్టేట్ హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు.
ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని ఇండిపెండెన్స్ కౌంటీలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఎనిమిది కౌంటీల్లో 50 మందికిపైగా గాయపడినట్లు ఆర్కాన్సాస్ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 కౌంటీల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు తెలిపారు. విద్యుత్ లైన్లు, చెట్లు కూలిపోయాయని ఆర్కాన్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఒక ప్రకటనలో తెలిపింది. గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్‌తో తాను మాట్లాడానని, ప్రజల రక్షణకు చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లో కౌంటీలో దుమ్ము తుపాను కారణంగా జరిగిన కారు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక మిసిసిపీలో ఆరుగురు మృతి చెందారు.
అమెరికా వ్యాప్తంగా బలమైన గాలుల ప్రభావం వల్ల అనేక ప్రాంతాల్లో మరణాలు సంభవించాయి. అంతేకాకుండా 100కి పైగా అడవుల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. శనివారం సంభవించిన టోర్నడోల కారణంగా తూర్పు లూసియానా, మిస్సిస్సిప్పి, అలబామా, పశ్చిమ జార్జియా, ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. టోర్నడోలు మరిన్ని వచ్చే అవకాశం ఉందని, అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండవచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో దీని ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
Also Read..
ISS | ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైన క్రూ-10 మిషన్.. భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్
US Strikes | యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై అమెరికా భీకర దాడి.. 24 మంది మృతి
Vastu Shastra | శరీరానికి.. ఇంటికి సంబంధం ఏంటి?