లండన్, డిసెంబర్ 4: యూకేలో లింగమార్పిడికి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. చాలా మంది స్త్రీలు పురుషుడిగా మారిపోవాలని తహతహలాడుతున్నారు. ఆ దేశంలో లింగమార్పిడి సర్జరీ చేయించుకొనేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) నిధులు సమకూర్చాలని ట్రాన్స్జెండర్ల హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్హెచ్ఎస్ అనేది ఇంగ్లండ్‌లో పబ్లిక్‌గా నిధులు సమకూర్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ. కాగా, బ్రిటన్‌లో వివిధ ప్రమాదాల్లో పురుషాంగం దెబ్బతిన్న చాలా మంది వ్యక్తులు లింగమార్పిడి లేదా పురుషాంగాన్ని పునర్నిర్మించే శస్త్రచికిత్స (ఫాలోప్లాస్టీ) కోసం క్యూలో ఉన్నారు.
యూకేలో కేవలం న్యూ విక్టోరియా హాస్పిటల్లో మాత్రమే ఈ సర్జరీ నిర్వహిస్తున్నారు. కొవిడ్ వల్ల ఫాలోప్లాస్టీ పెండింగ్ లిస్ట్ పెరిగిపోయింది. వీరందరికీ సర్జరీ చేయాలంటే కనీసం నాలుగేండ్లు పడుతుంది. అంత సమయం తాము వేచి ఉండలేమని, ఫాలోప్లాస్టీ కోసం తమను విదేశాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సర్జరీకి రూ. 21 లక్షలు ఖర్చు అవుతుంది. విదేశాలకు వెళ్లి లింగమార్పిడి చేయించుకునేందుకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ మొత్తాన్ని సేకరించాలని కూడా కొంతమంది నిర్ణయించుకున్నారు. ఈ సర్జరీ కోసం బ్రిటన్వ్యాప్తంగా మొత్తం 2 వేల మంది క్యూలో ఉన్నట్టు ‘ట్రాన్సాక్చువల్’ (ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాడే) గ్రూప్ అంచనా వేసింది.
ఫాలోప్లాస్టీ అంటే?
ఫాలోప్లాస్టీ అంటే పురుషాంగాన్ని పునర్నిర్మించడం లేదా పురుషాంగాన్ని సృష్టించడం. రోగి చర్మంపై అంటుకట్టే పద్ధతి ద్వారా పురుషాంగాన్ని కృత్రిమంగా పునర్నిర్మిస్తారు. పురుషాంగ విస్తరణ ఆపరేషన్, పురుషాంగం పొడవు, వెడల్పును పెంచే సర్జరీ, పురుషాంగాన్ని పునర్నిర్మించే ఆపరేషన్. ఇలా మూడు రకాలుంటాయి. వ్యక్తి శరీరంలోని ముంజేయి లేదా తొడ భాగంలో పురుషాంగాన్ని గ్రాఫ్టింగ్ ద్వారా పునర్నిర్మిస్తారు. దీన్ని కత్తిరించి శస్త్రచికిత్స ద్వారా మూత్రాశయానికి జోడిస్తారు. రక్తనాళాలు, నాడిని అనుసంధానిస్తారు. అంగస్తంభన కలిగేలా చేస్తారు.