Sunita Williams | వాషింగ్టన్, సెప్టెంబర్ 8: సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లను ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) వద్దే వదిలేసి బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమిపైకి చేరుకుంది. వ్యోమగాములు లేని ఖాళీ స్పేస్‌క్రాఫ్ట్ గత శుక్రవారం న్యూమెక్సికోలో దిగింది. బోయింగ్ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్ స్పేస్ మిషన్ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే తిరుగు ప్రయాణానికి సంబంధించి సాంకేతిక లోపం తలెత్తటంతో, విల్మోర్, సునీతా విలియమ్స్ ఐఎస్ఎస్ వద్దే ఉండిపోవాల్సి వచ్చింది. సెప్టెంబర్‌లో ‘నాసా’ స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘డ్రాగన్’ రాకెట్‌ను పంపేందుకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరిలో చేపట్టే తిరుగు ప్రయాణంలో సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి మీదకు చేరుకుంటారని తెలిసింది.
గాజా: ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో మృతుల సంఖ్య 40,939కి చేరుకుంది. హమాస్ ఆరోగ్య శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గడచిన 48 గంటల్లో ఇజ్రాయెల్ దాడులకు 61 మంది బలైపోయారు. గత ఏడాది అక్టోబరులో ప్రారంభమైన ఈ యుద్ధంలో సుమారు 94,616 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా (సీఐఏ), బ్రిటన్ (ఎంఐ6) విదేశీ నిఘా సంస్థల అధిపతులు అత్యంత అరుదైన ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.