Gotabaya | శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు. బుధవారం (2022 జూలై 13)న రాజీనామా చేస్తారని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహిందా యాపా అబేయవర్దేనా ప్రకటించారు. ఈ మేరకు మహిందా యాపా అబేయవర్దేనా వీడియో క్లిప్‌ను శనివారం మీడియాకు విడుదల చేశారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో నాయకులను చేసిన విజ్ఞప్తికి అంగీకరించారని మహిందా యాపా తెలిపారు. అధికార మార్పిడి సజావుగా సాగేందుకు బుధవారం వరకు గోటబయా రాజపక్స అధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. విపక్షాలు కూడా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
అంతకుముందు, శనివారం ఉదయం అధ్యక్షుడు గోటబయా రాజఫక్స తన అధికారిక నివాసం నుంచి పరారైనట్లు వార్తలొచ్చాయి. ఆయన పరార్ కాగానే నివాసంలోకి నిరసనకారులు పోటెత్తారు. గందరగోళం మధ్య శ్రీలంక నేవీ నౌకలో సూట్‌కేస్‌లతో పరారైనట్లు సమాచారం. ఆ సూట్‌కేస్‌లు గోటబయావేనని స్థానిక మీడియా ఆరోపించింది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో నాటి ప్రధాని మహీంద్రా రాజపక్సె రాజీనామా చేశారు. దీంతో గత మే నెలలో ప్రధానిగా విక్రమసింఘేను అధ్యక్షుడు గోటబయా రాజపక్సె నియమించారు. కానీ పరిస్థితులు విషమించడంతో విక్రమసింఘే తానూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రజల భద్రత కోసం తన పార్టీ నేతల సిఫారసుల మేరకు అఖిల పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తున్నట్లు తెలిపారు.