Sri Lanka crisis | శ్రీలంక ప్రధాని పదవికి రణిల్ విక్రమసింఘే శనివారం రాజీనామా చేశారు. దీంతో శ్రీలంకలో అన్ని రాజకీయ పార్టీల జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్నది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్సే తన అధికార నివాసం నుంచి పరారీ కావడం.. ఆందోళనకారులు అధికార కార్యాలయంలోకి దూసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానిగా విక్రమ సింఘే రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
శనివారం ఉదయమే తాను తన ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని విక్రమ సింఘే సంకేతాలిచ్చారు. దేశంలో అన్ని పార్టీల జాతీయ ప్రభుత్వం ఏర్పాటై సభావిశ్వాసం పొందిన తర్వాత ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేస్తారని ప్రధాని మీడియా డివిజన్ తెలిపింది. అప్పటి వరకు ప్రధానిగా కొనసాగుతారని తెలిపింది.
ఈ వారంలో శ్రీలంకలో పెట్రోల్ పంపిణీ పునఃప్రారంభం కానున్నది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వచ్చేవారం శ్రీలంకకు రానున్నారు. త్వరలో ఐఎంఎఫ్ డెట్ సస్టెయినబిలిటీ రిపోర్ట్ వెలుగులోకి రానున్నది. ఈ నేపథ్యంలో తాను వైదొలుగుతానని పార్టీ నేతలకు ప్రధాని విక్రమసింఘే చెప్పినట్లు తెలుస్తున్నది. ప్రజల భద్రత దృష్ట్యా విపక్ష పార్టీల నుంచి వచ్చిన సిఫారసును తాను ఆమోదించేందుకు సిద్ధం అని రణిల్ విక్రమసింఘే తెలిపారు.