శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 16:22:54

కమలా హారిస్ విజయం కోసం తిరువారూరులో ప్రత్యేక పూజలు

కమలా హారిస్ విజయం కోసం తిరువారూరులో ప్రత్యేక పూజలు

తిరువారూర్ : అమెరికా ప్రజాస్వామ్య ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాదేవి హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ తమిళనాడులో ప్రత్యేక పూజలు జరిపారు. తిరువారూరు జిల్లాలోని పైంగనాడు గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. 

కమలా హారిస్ తాత పీవీ గోపాలన్ పైంగనాడు గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో తమ ఊరికి చెందిన కమలాదేవి గెలువాలంటూ పైంగనాడు గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దాదాపు 200 మందికి అన్నప్రసాదం చేపట్టారు. ఎన్నికలలో కమలాదేవి హారిస్‌ విజయం సాధించాలని యువకులు గ్రామంలో హోర్డింగ్స్‌ పెట్టారు. అమెరికా ఎన్నికలకు డెమోక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలాదేవి హారిస్ నామినేట్ అయిన తరువాత ఈ మారుమూల గ్రామం పేరు అందరి నోటా నానుతున్నది. ఈ గ్రామం తమిళనాడులోని తిరువరూర్ జిల్లా మన్నార్‌గుడి తాసిల్‌లో ఉన్నది. తన తాత ఇక్కడ పుట్టి పెరిగినందున కమలా హారిస్‌ను తమ సొంతమని పిలువడం ద్వారా  గ్రామస్థులు గర్వపడుతున్నారు. కమలా హారిస్ పూర్వీకులు గ్రామాన్ని విడిచిపెట్టినప్పటికీ.. వారు గ్రామ దేవాలయంతో తమ సంబంధాన్ని అలాగే ఉంచుకున్నారు. హారిస్ తాత, కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ ఆలయం పునరుద్ధరణ కోసం అనేక విరాళాలు ఇచ్చారు. 2014 లో కమలా హారిస్ పేరిట విరాళం ఇచ్చినట్లు ఆలయ ధర్మకర్త రమణి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.