లండన్: ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో జరిగిన ట్రిపుల్ మర్డర్.. తీవ్ర హింసకు దారి తీసింది. ముగ్గురు బాలికలను ఓ టీనేర్ కత్తితో పొడిచి చంపిన ఘటన తర్వాత సౌత్‌పోర్ట్‌లో భీకర స్థాయిలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ లండన్‌లో ఆందోళన చేస్తున్న సుమారు వంద మందికిపై అరెస్టు చేశారు. డౌనింగ్ స్ట్రీట్‌కు సమీపంలో ఉన్న వైట్హాల్ వద్ద నిరసనకారులు ఆందోళన చేపట్టారు. హార్ట్లీ పూల్ వద్ద కూడా ఆందోళన చేస్తున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అనేక మంది ఆఫీసర్లు గాయపడ్డారు. పోలీసు కారుకు నిప్పుపెట్టారు. ఈ కేసులో విచారణ చేపట్టేందుకు ప్రధాని సర్ కీర్ స్టార్మర్ పూర్తి మద్దతు ఇస్తున్నారు.
కత్తితో దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడిని 17 ఏళ్ల అక్సెల్ ముగన్వా రుడాకుబనాగా గుర్తించారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బ్లేడ్ లాంటి ఆయుధం కలిగి ఉన్నట్లు కూడా అతనిపై కేసు బుక్ చేశారు. ఇవాళ లివర్‌పూల్ కోర్టులో ఆ టీనేజర్‌ను హాజరుపరిచారు. ప్రస్తుతం అతను కస్టడీలో ఉన్నాడు. అనుమానిత హంతకుడి పేరును ప్రకటించేందుకు బ్రిటీష్ పోలీసులు తీవ్ర కసరత్తు చేశారు.