సియోల్: ప్రపంచంలోనే అత్యల్ప స్థాయిలో దక్షిణ కొరియాలో సంతానోత్పత్తి రేటు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రేటు మరింత పడిపోయింది. 2018లో ఒక మహిళకు ఒక శిశువు కన్నా తక్కువ స్థాయిలో సంతానోత్పత్తి రేటు నమోదు అయ్యింది. అయితే ఆ నాటి నుంచి సంతానోత్పత్తి రేటు క్షీణిస్తూనే ఉన్నది. ఇక బుధవారం రిలీజైన కొత్త లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆ రేటు 0.81 స్థాయికి పడిపోయినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే సంతానోత్పత్తి రేటు మూడు పాయింట్లు పడిపోయినట్లు తెలిపారు. ఇక ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో సంతానోత్పత్తి రేటు 1.6 చిన్నారులుగా ఉంది. గడిచిన 60 ఏళ్లలో ఫెర్టిలిటీ రేటు గణనీయంగా తగ్గినట్లు ఓఈసీఈ తెలిపింది. 2020లో దక్షిణ కొరియాలో శిశు జననాల కన్నా మరణాల రేటు అధికంగా నమోదు అయిన విషయం తెలిసిందే. ఇంటి, జీవన ఖర్చులు అధికంగా పెరగడం, కోవిడ్ ప్రభావం వల్ల చాలా మంది 2021లో పిల్లలు కనేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. జనాభా కుంచించుకుపోతే సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.