South Korea | హైదరాబాద్, డిసెంబర్ 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఈ భూప్రపంచంపై కనుమరుగుకానున్న తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డుల్లో నిలిచిపోనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. జనాభా సంక్షోభమే దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు. కొరియాలో జననాల రేటు చరిత్రలో ఎన్నడూ చూడనిస్థాయికి పడిపోయినట్టు గుర్తుచేస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి ఆ దేశ జనాభా 66 శాతం మేర పడిపోనున్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుతం 5.2 కోట్ల మంది ఉన్న దక్షిణ కొరియా జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి 1.4 కోట్లకు పడిపోనున్నట్టు చెప్తున్నారు.
జనాభాను కట్టడి చేయడానికి 1960వ దశకంలో అప్పటి కొరియా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పాలసీని తీసుకొచ్చింది. దీంతో ఒక్కో మహిళకు ఆరుగురు సంతానం ఉండే స్థితి నుంచి 1983 నాటికి ఇద్దరికి దిగివచ్చింది. ఆ తర్వాత ఇది మరింతగా పడిపోయింది. ఇప్పుడు ఆ నిర్ణయమే జనాభా సంక్షోభానికి కారణంగా మారింది.
జననాల రేటును పెంచేందుకు పన్ను మినహాయింపులు, శిశుసంరక్షణ ప్రోగ్రామ్స్‌లో రాయితీలు, సైన్యంలో చేరే వారికి సంతానంలో సడలింపులను ఇస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రావట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే, జననాల రేటు పూర్తిగా పడిపోయి త్వరలోనే దక్షిణ కొరియా ఉనికే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.