IVN Therapy | సియోల్, అక్టోబర్ 4: దక్షిణ కొరియా, చైనాలో ఉద్యోగులు తమ అలసటను తగ్గించుకునేందుకు, కొత్త శక్తిని పొందేందుకు విరివిగా ఇంట్రావీనస్ డ్రిప్స్‌ను (స్లైన్లను) ఉపయోగిస్తున్నట్టు ‘ఎంవై న్యూస్’ వెల్లడించింది. ఇంట్రావీనస్ న్యూట్రియెంట్ థెరపీ (ఐవీఎన్టీ)గా పిలిచే ఈ ప్రక్రియలో ద్రవ విటమిన్లను, స్లైన్‌ను నేరుగా దేహంలోకి పంపిస్తారు. గతంలో క్యాన్సర్ చికిత్సకు, కీళ్ల ఆరోగ్యానికి, ఎదుగుదలకు సంబంధించిన లోపాల చికిత్సకు ఉపయోగించిన ఐవీఎన్టీ ఇప్పుడు సౌందర్య వైద్యంలోకి ప్రవేశించినట్టు దక్షిణ కొరియాకు చెందిన ‘మెడికల్ ఈస్థటిక్స్ న్యూస్’ ఓ నివేదికలో పేర్కొన్నది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఓ క్లినిక్‌లో ఈ న్యూట్రియెంట్ డ్రిప్స్ ధర ఒక్కో సెషన్‌కు 25 వేల నుంచి 60 వేల వాన్ల (దాదాపు రూ.1,500 నుంచి రూ.3,600) వరకు ఉంటుంది.ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లతోపాటు సీ విటమిన్ సమృద్ధిగా ఉండే సిండ్రెల్లా డ్రిప్ ఒత్తిడిని తగ్గించేందుకు, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసేందుకు దోహదపడుతుందని తెలిపింది. బీ1 విటమిన్‌తో కూడిన గార్లిక్ డ్రిప్ అలసటను తగ్గిస్తుందని ఆ క్లినిక్ పేర్కొన్నది.