South Africa Killings : అర్ధరాత్రి సమయంలో సాయుధులైన 12 మంది దుండగులు రెండు వాహనాల్లో వచ్చి బీభత్సం సృష్టించారు. ఓ పబ్ (Tavern) లో చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. దక్షిణాఫ్రికా (South Africa) లోని జొహన్నెస్‌బర్గ్ (Johannesburg) వెస్ట్ ప్రాంతంలోగల బెకర్స్‌డాల్ టౌన్షిప్ (Bekkers Dal township) లో ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగులు పబ్‌లో చొరబడి ఒక్కసారి కాల్పులు మొదలుపెట్టడంతో భయాందోళనకు గురైన జనం పరుగులు తీశారు. పబ్‌లో కాల్పుల అనంతరం దుండగులు పారిపోతూ కూడా కనిపించిన వారిపై కాల్పులు జరిపారు. వీధుల్లో కూడా కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ కాల్పుల్లో మరణించిన 9 మందిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
కాల్పులకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని చెప్పారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఘటనా ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుంటే ఈ నెల 6న ప్రిటోరియా సమీంలో కూడా కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు.