జోహన్నస్బర్గ్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ మృతి తర్వాత ఆమె కిరీటంలో ఉన్న వజ్రాలను ఇచ్చేయాలంటూ డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది. గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికాగా పిలువబడే కలినన్ డైమండ్‌ను ఇచ్చేయాలని దక్షిణాఫ్రికా డిమాండ్ చేస్తోంది. ఆ డైమండ్ దాదాపు 500 క్యారెట్లు ఉంటుంది. 1905లో దక్షిణాఫ్రికాలో మైనింగ్‌లో దొరికిన ఓ పెద్ద వజ్రం నుంచి కలినన్ డైమండ్‌ను తీశారు. రాణి వద్ద ఉండే దండంలో కలినన్ వజ్రం ఉన్నట్లు తెలుస్తోంది. తక్షణమే ఆ వజ్రాన్ని ఇవ్వాలంటూ దక్షిణాఫ్రికా కార్యకర్త తండుక్సోలో సబేలో డిమాండ్ చేశారు. డైమండ్ ఇవ్వాలంటూ ఆన్లైన్లో పిటిషన్ ద్వారా సంతకాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 6వేల మంది సంతకం చేశారు. బ్రిటన్ ఎత్తుకెళ్లిన బంగారం, వజ్రాలను ఇచ్చేయాలని సౌతాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు వుయోల్వెత్తు జుంగులా తెలిపారు. 1600 సంవత్సరానికి చెందిన రాణి దండంలో 530 క్యారెట్ల డైమండ్ ఉన్నట్లు ఓ వార్త సంస్థ చెబుతోంది. టవర్ ఆఫ్ లండన్‌లో ఉన్న జువెల్ హౌజ్‌లో వజ్రాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు.