టెల్ అవీవ్, ఏప్రిల్ 1: అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలు కొట్టేస్తాం. అక్కరకు రావనుకున్న చెట్లను నరికేస్తాం. మన అవసరాలకు తగ్గట్టుగా మొక్కలు, చెట్లను ఏం చేసినా ఫర్వాలేదనుకుంటాం. అయితే, చెట్లు కూడా మనలా మాట్లాడతాయని, బాధ కలిగితే ఏడుస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మొదటిసారిగా మొక్కల ఏడుపును అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్స్‌తో రికార్డు చేశారు ఇజ్రాయిల్‌లోని టెల్అవీవ్ శాస్త్రవేత్తలు. మొక్కల నుంచి వచ్చే శబ్దాలను రికార్డు చేసి విశ్లేషించారు. ఈ వివరాలు ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మొక్కల నుంచి ‘క్లిక్’ లాంటి శబ్దాలు వస్తాయని, ఇది పాప్‌కార్న్ కొరికినప్పుడు వచ్చే శబ్దంతో పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, మన చెవులు ఈ శబ్దాలను వినలేవని తెలిపారు. టమాట, పొగాకు మొక్కలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టినప్పటికీ గోధుమ, మొక్కజొన్న వంటి మొక్కల నుంచి శబ్దాలను రికార్డు చేశారు.
రికార్డు చేసే సమయానికి కొన్ని మొక్కలకు ఐదు రోజులుగా నీరు అందలేదు. మరికొన్నింటి కాండం కోతకు గురైంది. పూర్తి నిశ్శబ్ద వాతావరణంలో అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్లను అమర్చి మొక్కల నుంచి శబ్దాలను రికార్డు చేశారు. ‘సాధారణంగా మనుషులు 16 కిలోహెర్ట్ ఫ్రీక్వెన్సీ వరకు వినగలుగుతారు. 40-80 కిలోహెర్ట్ ఫ్రీక్వెన్సీలో మొక్కల నుంచి వచ్చే శబ్దాలను రికార్డు చేశాం. ఎలాంటి సమస్య లేని మొక్కలు సగటున గంటకు ఒకసారి కంటే తక్కువసార్లు శబ్దం చేయగా, నీరందని, గాయాలకు గురైన మొక్కలు గంటకు డజన్ల సార్లు శబ్దాలు చేశాయి’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త లిలచ్ హడనీ తెలిపారు. ఇలా ఎక్కువసార్లు చేసే శబ్దాన్ని మొక్కల ఏడుపుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొక్కల నుంచి శబ్దాలు వస్తాయని తాము ఈ అధ్యయనం ద్వారా నిరూపించామని ఆమె పేర్కొన్నారు.