ప్రేగ్, మే 15: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై ఓ సాయుధ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఫికో ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నది. ఆయన్ను భద్రతా సిబ్బంది హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా బన్స్కా బైస్ట్రికాలోని దవాఖానకు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం రాబర్ట్ ఫికో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని ఆయన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు అయిన సందేశం పేర్కొన్నది.
హాండ్లోవా పట్టణంలో జరిగిన ఓ రాజకీయ కార్యక్రమానికి రాబర్ట్ ఫికో హాజరైన సందర్భంగా ఈ దాడి జరిగింది. హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఫికోపై దుండగుడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడని, దీంతో ఆయన కడుపులో తీవ్ర గాయమైందని స్థానిక మీడియా తెలిపింది. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు మూడు వారాల ముందు స్లొవేకియాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని ఫికోపై జరిగిన దాడిపై స్లొవేకియా అధ్యక్షుడు జుజానా క్యాపుటోవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను షాక్కు గురిచేసిందని, ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.