న్యూఢిల్లీ, ఆగస్టు 15: భారత్-పాకిస్థాన్ అణు యుద్ధానికి సిద్ధపడుతున్న పరిస్థితులలో తానే వారి మధ్య సంధి కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. అలాస్కాలో శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లేముందు వాషింగ్టన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గడచిన ఆరు నెలల్లో ఆరు యుద్ధాలను తాను ఆపానని ట్రంప్ తెలిపారు. ఇందుకు తాను ఎంతో గర్విస్తున్నానని ఆయన చెప్పారు.
కాంగో, రువాండ మధ్య గడచిన 31 సంవత్సరాలుగా యుద్ధం సాగుతోందని, దాన్ని కూడా తానే పరిష్కరించి శాంతిని స్థాపించానని ట్రంప్ చెప్పారు. భారత్, పాకిస్థాన్ విషయానికి వస్తే ఆరు లేదా ఏడు విమానాలు కూలిపోయాయని, అణు యుద్ధానికి ఆ రెండు దేశాలు సిద్ధపడుతుండగా తానే దాన్ని పరిష్కరించానని వ్యాఖ్యానించారు.