జకార్తా: ఇండోనేషియాలోని అనక్ క్రకటౌ అగ్ని పర్వతం విస్ఫోటం కారణంగా ఆదివారం జకార్తా సహా ఆరు విమానాశ్రయాలను మూసేయాల్సి వచ్చింది. దీని వల్ల 58 అంతర్జాతీయ సర్వీసులు సహా 301 విమాన సేవలకు అంతరాయం ఏర్పడిందని రాయిటర్స్ తెలిపింది. జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జల సంధిలో ఉన్న ఈ అగ్ని పర్వతంలో శుక్రవారం నుంచి విస్ఫోటన సంకేతాలు కనిపించాయని ఆ దేశ భౌగోళిక ఏజెన్సీ వెల్లడించింది.
ఆదివారం ఉదయం 3.53కి 30 సెకండ్ల పాటు అది విస్ఫోటం చెందిందని పేర్కొంది. అగ్ని పర్వతానికి కనీసం 3 కిలోమీటర్ల దూరం వరకు సందర్శకులెవరూ వెళ్లొద్దని హెచ్చరించింది. జకార్తా విమానాశ్రయం, జకార్తా, లంపంగ్ ప్రావిన్స్‌లలోని పలు ప్రాంతాల్లో అగ్ని పర్వతం బూడిదను గుర్తించారు. విస్ఫోటం కారణంగా రెండు బూడిద మేఘాలు ఏర్పడినట్టు ఇండోనేషియా అగ్ని పర్వత పరిశోధన సంస్థ తెలియజేసింది.