మన్సూరాబాద్, సెప్టెంబర్ 6 : 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రహరి రామరాజు హెచ్చరించారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ప్రగతినగర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన 1969 ఉద్యమకారుల రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాటి ఉద్యమంలో పాల్గొన్న 90 శాతం మంది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేశారు. తొలిదశ ఉద్యమంలో ఎలక్ట్రానిక్ మీడియా లేదని, ప్రింట్ మీడియా ఉన్నా ఒకటి, రెండు పేపర్లు మాత్రమే ఉండేవని తెలిపారు.
నాటి ఉద్యమంలో జైలుకెళ్లిన వారు తమ గుర్తింపు కోసం పోలీస్ అధికారుల వద్దకు వెళ్లి తమకు ఆధారాలు ఇవ్వాలని వేడుకున్నా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత పది జిల్లాల్లో తిరిగి జిల్లా కమిటీలను ఏర్పాటుచేసి లభించిన సమాచారం మేరకు ఉద్యమకారుల లిస్టు తయారుచేసి ప్రభుత్వానికి, ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి అందించినట్టు చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఇప్పటికే మూడొంతుల మంది మృతి చెందారని, మిగిలిన వారు 3 నుంచి 4 వేల మంది వరకే ఉంటారని తెలిపారు. వీరిని కమిటీ గుర్తించి గుర్తింపు కార్డులు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి భార్యలను కూడా ఉద్యమకారులుగా గుర్తించాలని కోరారు.
లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీ సుదర్శన్‌రావు, సంఘం ఉపాధ్యక్షులు వనం చంద్రమౌళి, కే సీతారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి మారం సంతోష్‌రెడ్డి, కోశాధికారి చంద్రారెడ్డి, వివిధ జిల్లాల ప్రతినిధులు శ్రీహరి మూలకండ్ల, లక్ష్మీనారాయణ, కూతురు కృష్ణమూర్తి, కే మోహన్‌రావు, రామణి, జయప్రకాశ్, విశ్వేశ్వర్రావు, రుద్రమ్మ, వేముల లింగయ్య, జగిని దయానంద్, గోపు చలీనమ్మ, రాజలింగం, ముత్తినేని వెంకటేశ్వర్రావు, శివంగుల కృష్ణ పాల్గొన్నారు.