వాషింగ్టన్, నవంబర్ 1: అగ్రరాజ్యం అమెరికాలో విధించిన షట్డౌన్ నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ షట్డౌన్ వల్ల దేశ ఖజానాకు నెలకు దాదాపు 7 బిలియన్ డాలర్ల (రూ. 62,195 కోట్లు) నష్టం వాటిల్లింంది. షట్డౌన్ ఎత్తివేసి పూర్వ పరిస్థితులు ఏర్పడినా అది తిరిగి పొందలేని నష్టమని నిష్పక్షపాతంగా పనిచేసే కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) కొత్త నివేదిక తెలిపింది. అక్టోబర్ 1న ప్రారంభమైన షట్ డౌన్ వల్ల సంపద ఆవిరవుతోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలానికి మరింత నష్టం ఏర్పడుతుందని పేర్కొంది.
భవిష్యత్తులో ఏర్పడబోయే నష్టం అంచనాను హౌస్ బడ్జెట్ కమిటీకి రాసిన లేఖలో సీబీవో వివరించింది. నాలుగు వారాల షట్డౌన్లో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 7 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ఆరువారాల షట్డౌన్లో 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాల షట్డౌన్లో 14 బిలియన్ డాలర్లు (రూ. 1,24,390 కోట్లు) తగ్గుతుందని సీబీఓ అంచనా వేసింది. షట్డౌన్ సమయంలో 10 లక్షల మంది కార్మికులకు ఎలాంటి జీతం చెల్లించకపోవడం వల్ల వస్తువులు, సేవలపై వినియోగం బాగా తగ్గిపోయింది. షట్డౌన్ కారణంగా ఎక్కువ మంది ఫెడరల్ ఉద్యోగులకు ఎలాంటి చెల్లింపులు జరగడం లేదు.