జెరూసలేం: ఇజ్రాయల్ సేనలు, పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముస్లిం దేశాలైన ఈజిప్టు, జోర్డాన్లలోని ఇజ్రాయెల్ పౌరులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల్లోని తమ పౌరులు సాధ్యమైనంత త్వరగా ఆయా దేశాలను వదిలేసి స్వదేశానికి వచ్చేయాలని ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి లెవల్-4 హెచ్చరికలను జారీ చేసింది. అదేవిధంగా ఈజిప్టు, జోర్డాన్ దేశాలకు వెళ్లే యోచనలో ఉన్న పౌరులు కూడా తక్షణమే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఆ రెండు దేశాలకు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి ఒక ప్రకటన విడుదల చేసింది.