వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ప్రకటించింది. దుండగుడు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఇంకా అనుమానిత స్థలంగానే పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినట్లు ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రొజెక్ అన్నారు. దుండగుడు కాల్పులు జరిపిన ప్రదేశంలో కొన్ని అనుమానిత ప్యాకేజీలను గుర్తించినట్లు వెల్లడించారు. అవన్నీ పేలుడు పదార్థాలుగానే తాము భావిస్తున్నామన్నారు.
ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపింది ఎవరనే విషయాన్ని ధ్రువీకరించే పరిస్థితిలో తాము లేమని వెల్లడించారు. దుండగుడి లక్ష్యం ఏంటనేది కూడా ఇంకా తెలియడం లేదన్నారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి వద్ద ఐడీ లేదని, అతని గురించిన వివరాలు తెలుసుకునేందుకు డీఎన్ఏ సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిస్తే ప్రజలు తమకు తెలియజేయాలని, అది దర్యాప్తునకు సహాయపడుతుందని కోరారు.