కాఠ్మాండూ, ఆగస్టు 29: వరద ఉధృతికి ఊరిలోని ఇండ్లన్నీ కొట్టుకుపోయినా ఒక ఇల్లు మాత్రం మధ్యలో తట్టుకుని నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ ఒక్క ఇల్లు కూలిపోకుండా స్థిరంగా నిలబడటానికి గల కారణాలపై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మేఘా అనే నెటిజన్ దీనికి గల కారణాలను విశ్లేషించారు. వరదకు సంబంధించిన ప్రధాన బురద ప్రవాహ వేగం కుడి నుంచి ఎడమకు సాగగా, ఆ ఇంటి ఎదురుగా ఉన్న డ్రమ్ము వద్ద ప్రవాహం ఎడమ నుంచి కుడివైపు సాగుతున్నట్టు వీడియోలో కన్పించిందన్నారు. అంటే ఆ ఇంటిచుట్టూ వలయంగా కొంత ప్రాంతంలో బురద ప్రవాహం వ్యతిరేక దిశలో సాగిందన్నారు. దీని కారణంగా ఆ ఇల్లు ఉన్న మేరకు ప్రధాన వరద ప్రవాహం ఉద్ధృతి తగ్గిపోయింది.
నీరు ఇంటి చుట్టూ ఇంటికి, చెట్టుకు మధ్య ఉన్న సన్నని సందు గుండా ప్రవహించి ఆ తర్వాత ప్రధాన పవాహంలో తిరిగి కలిసినట్టు కన్పిస్తున్నదన్నారు. అలాగే ప్రవాహ ధాటికి తట్టుకునేలా ఆ ఇల్లు సాపేక్షంగా సురక్షితమైన ప్రాంతంలో ఉండిఉండవచ్చు. అయితే ఇంటి చుట్టూ వలయంగా ఏర్పడిన ప్రదేశంలో నీరు వ్యతిరేక దిశలో ఎందుకు ప్రవహిస్తున్నదనే విషయాన్ని తాను చెప్పలేనని, దానిని నిపుణులే శాస్త్రీయంగా వివరించాలని అన్నారు. భగవంతుడే ఆ భవంతిని కాపాడారంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, బహుశా అది కూడా నిజం కావచ్చునని మేఘా పేర్కొన్నారు.