Shigeru Ishiba : జపాన్ (Japans) దేశ ప్రధాన మంత్రి (Prime Minister) పదవికి షిగెరు ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ముఖ్యంగా జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు.
గత ఏడాది ఫుమియో కిషిద రాజీనామా తర్వాత అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్ష ఎన్నికల్లో షిగెరు ఇషిబా విజయం సాధించారు. అక్టోబర్లో జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువసభలో అధికార సంకీర్ణ సర్కారు మెజారిటీని సాధించలేకపోయింది. అంతకుముందు దిగువ సభలోనూ మెజారిటీ కోల్పోయింది. దాంతో సొంత పార్టీ సభ్యుల నుంచి ప్రధానిపై ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వ మార్పు కోసం ముందస్తు ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై సెప్టెంబర్ 8న చర్చించి నిర్ణయం తీసుకునేందుకు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం నిర్వహించిన ఇషిబా.. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకునేందుకుగాను ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు చెప్పారు.