ప్రపంచానికి ఊపిరి తిత్తులు అని పిలుచుకునే అమెజాన్ అడవుల్లో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి మూడేళ్ల క్రితం పరిశోధకుల కంట పడింది. ఈ ప్రాంతంలో త్రీడీ మ్యాపింగ్ చేస్తుంటే కనిపించిందీ చెట్టు. దీంతో వాళ్లలో ఉత్సుకత పెరిగింది. కానీ మూడేళ్లుగా దాన్ని చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఆ చెట్టే ఏంజెలిమ్ వెర్మెలో. సైంటిఫిక్ పరిభాషలో దీని పైరు ‘డినిజియా ఎక్సెల్సా’.
2019లో 3డీ మ్యాపింగ్ ప్రాజెక్టు సమయంలో ఈ చెట్టును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది చాలా ఎత్తుగా కనిపించడంతో దీనిపై పరిశోధనలు చేయాలని అనుకున్నారు. అయితే అక్కడకు బయలుదేరిన బృందానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కొందరు ఆ అడవుల్లోని వాతావరణాన్ని తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యారు కూడా. దీంతో పరిశోధకుల బృందం నిరాశగా వెనుతిరిగింది.
ఈ గత అనుభవాలతో మరింత జాగ్రత్తగా ఈ ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమైంది 19 మంది సభ్యుల బృందం. ఈ జర్నీ ఎలా చేయాలని రకరకాల ప్లాన్లు వేసుకున్నారు. చివరకు సెప్టెంబరు 12న అడవిలో అడుగుపెట్టారు. ముందుగా ప్రమాదకరమైన ప్రవాహాలను ఎదుర్కొంటూ 250 కిలోమీటర్ల దూరం పాటు పడవల్లో ప్రయాణించారు.
ఆ తర్వాత మరో 20 కిలోమీటర్లపాటు కాలి నడకనే అడవిని సవాల్ చేశారు. కఠినమైన అడవి పరిస్థితుల్లో అంత దూరం నడిచి చివరకు ఈ చెట్టును చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఆ బృందంలోని ఒక వ్యక్తిని విషపూరితమైన సాలీడు కరిచినట్లు వైద్యులు చెప్పారు.
ఎట్టకేలకు ఆ చెట్టును చేరుకున్న తర్వాత దాన్ని చూస్తే ఒక అద్భుతాన్ని చూసినట్లు అనిపించిందని ఈ ట్రిప్‌ను ఆర్గనైజ్ చేసిన ఫారెస్ట్ ఇంజినీర్ డీగో అర్మాండో సిల్వ చెప్పారు. ఈ చెట్టు సుమారు 300 అడుగుల ఎత్తు ఉందని, దీని మొదలు 32 అడుగుల వెడల్పు ఉందని చెప్పారు. అమెజాన్ అడవుల్లో ఇప్పటి వరకు చూసిన అతిపెద్ద చెట్టు ఇదేనని పరిశోధకులు స్పష్టం చేశారు.