న్యూఢిల్లీ: మన విశ్వం అత్యంత వేగంగా విస్తరిస్తున్నదని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. కానీ అది మందగమనంలో ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది నిజమని రుజువైతే, కాస్మోస్ (విశ్వ శాస్త్రం) గురించి మన అవగాహన, అంతిమ గతి పూర్తిగా మారిపోతాయి. శాశ్వతంగా విస్తరించడానికి బదులుగా, మన విశ్వం వృద్ధి చెందడం ఆగిపోయి, బిగ్ క్రంచ్ (విశ్వం కుంచించుకుపోవడం) ప్రారంభమవుతుంది. విశ్వం విస్తరణ వేగాన్ని డార్క్ ఎనర్జీ (అంతు బట్టని బలం) లాగుతూ ఉంటుదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ బలం కూడా రాను రాను బలహీనపడవచ్చునని తాజా అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యంగ్-వుక్ లీ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. విశ్వం నెమ్మదిగా విస్తరించే దశకు ఇప్పటికే చేరుకుందని లీ చెప్పారు. గతంలో విశ్వసించినదాని కన్నా ఎక్కువ వేగంగా డార్క్ ఎనర్జీ మారుతున్నట్లు తమ అధ్యయనం వెల్లడించిందన్నారు.
తాము వెల్లడించిన అంశాలు నిజమని తేలితే, డార్క్ ఎనర్జీని గుర్తించిన తర్వాత విశ్వ శాస్త్రం (కాస్మాలజీ)లో భారీ మార్పు జరుగుతుందని చెప్పారు. డార్క్ ఎనర్జీని 27 ఏళ్ల క్రితం కనుగొన్నారని, ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికీ దానిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ భావన తప్పు అని ఇప్పుడు రుజువైందన్నారు. చొక్కా మొదటి బటన్ను తప్పుగా పెట్టుకోవడంతో దీనిని పోల్చారు.