Planet K2-18b | లండన్: గ్రహాంతర జీవుల అన్వేషణలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో సౌర వ్యవస్థ ఆవల జీవసంబంధ ఆనవాళ్లను కనుగొన్నారు. కే2-18బీ అనే గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్), డైమిథైల్ డైసల్ఫైడ్ (డీఎండీఎస్) అనే వాయువులను గుర్తించారు. ఇవి సూక్ష్మజీవుల ఉనికికి సంకేతాలు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఈ మేరకు ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో అధ్యయనం ప్రచురితమైంది. ఈ పరిశోధనకు భారత్ సంతతి శాస్త్రవేత్త నిక్కు మధుసూధన్ నేతృత్వం వహించడం విశేషం.
ఈ వాయువులు జీవసంబంధ ప్రక్రియల ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతాయి. జీవుల మనుగడ ఉండే భూమిపై తప్ప ఇప్పటివరకు వీటి జాడను ఎక్కడా కనుగొనలేదు. ఫైటోప్లాంక్టన్ ఆల్గే అనే సముద్ర సూక్ష్మజీవులు వీటిని విడుదల చేస్తాయి. జీవసంబంధ వాయువుల జాడ ఉందంటే.. ఆ గ్రహంపై జీవులు లేదా సూక్ష్మజీవులు మనుగడ సాగించే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర వ్యవస్థ ఆవల జీవుల అన్వేషణలో ఇది గొప్ప ముందడుగుగా ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మధుసూధన్ పేర్కొన్నారు. ఆ గ్రహంపై జీవులు ఉన్నాయని కచ్చితంగా చెప్పడం లేదు కానీ, సౌర వ్యవస్థ ఆవల జీవులు మనుగడ సాగిస్తున్నాయని చెప్పేందుకు ఇది బలమైన సంకేతమని ఆయన పేర్కొన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని తెలిపారు.
కే2-18బీ గ్రహం భూమికి 124 కాంతి సంవత్సరాల దూరంలో లియో కాన్స్టలేషన్లో ఉంది. ఇది భూమి కంటే 8.6 రెట్లు పెద్దది. దాని వ్యాసం భూమి వ్యాసం కంటే 2.6 రెట్లు ఎక్కువ. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో అంతకుముందే ఈ గ్రహంపై మీథేన్, కార్బన్డయాక్సైడ్ వాయువులను కనుగొన్నారు. ఈ వాయువులను సౌర వ్యవస్థ ఆవల కనుగొనడం అదే మొదటిసారి. తాజాగా రెండు వాయువులను గుర్తించడంతో జీవుల మనుగడపై శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు. హైడ్రోజన్‌తో కూడిన, సూక్ష్మజీవులు మనుగడ సాగించేలా ద్రవ సముద్రాలతో నిండిన గ్రహాలను హైషియన్ వరల్డ్స్ అంటారు. సౌర వ్యవస్థ ఆవల ఉండే వీటిని ఎక్సో ప్లానెట్స్ అని పిలుస్తారు. కే2-18బీ కూడా అలాంటిదే.