లండన్: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛల పరిస్థితిపై ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “భారత్‌లో పాత్రికేయులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు మొదలైన వారి స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు” అని సల్మాన్ చెప్పారు. దేశ చరిత్రను తిరగరాయాలనే ఆకాంక్ష ఉన్నట్లు కనిపిస్తున్నదన్నారు. హిందువులు మంచివాళ్లు, ముస్లింలు చెడ్డవాళ్లు అని రాయాలనుకుంటున్నట్లు కనిపిస్తున్నదన్నారు. “గాయపడిన నాగరికత’ వీఎస్ నైపాల్ గతంలో అన్నారని చెప్పారు. భారత దేశమంటే హిందూ నాగరికత అని, ముస్లింల రాకతో అది గాయపడిందని నైపాల్ చెప్పారన్నారు. ఆ ప్రాజెక్ట్ వెనుక చాలా శక్తి ఉందన్నారు. సల్మాన్ ఆరోపణలపై విమర్శకులు స్పందిస్తూ, ఆయన రాసిన పుస్తకాన్ని భారత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే నిషేధించిందని గుర్తు చేస్తున్నారు.