ఫిషింగ్ అంటే ఇష్టం ఉన్న 73 ఏళ్ల కేథరీన్ పెర్కిన్స్.. తన ఇద్దరు మిత్రులతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లింది. ఫ్లోరిడాకు సమీపంలోని స్టువర్ట్ తీరానికి వీళ్లు వెళ్లారు. అక్కడ చేపలు పట్టేందుకు గాలం వేసి ఎదురు చూశారు. కాసేపటికి ఒక గాలానికి ఏదో దొరికినట్లు వాళ్లకు అర్థమైంది. వెంటనే గాలానికి దొరికిన చేపను బయటకు లాగేందుకు ప్రయత్నించారు.
అయితే కాసేపటికి ఆ చేప నేరుగా తమ బోట్ వైపు రావడం వాళ్లు గమనించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నీళ్లలో నుంచి బయటకు దూకిన ఒక సెయిల్ ఫిష్.. తన పొడవాటి ముక్కుతో బోట్ అంచున నిలబడి ఉన్న కేథరీన్పై దాడి చేసింది. ఆమె జననాంగాల సమీపంలో బలంగా పొడిచేసింది. ఆ వెంటనే నీళ్లలోకి వెళ్లి మాయమైంది.
ఆ షాక్ నుంచి తేరుకున్న పడవలోని వారు వెంటనే కేథరీన్ను ఒడ్డుకు తీసుకొచ్చి వైద్యసహాయం అందించేందుకు ప్రయత్నించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను ఫ్లోరిడాలోని హెచ్సీఏ ఫ్లోరిడా లాన్వుడ్ హాస్పిటల్కు తరలించారు. తమపై దాడి చేసిన చేప సుమారు 100 పౌండ్లు అంటే 45 కేజీలపైగా బరువుంటుందని కేథరీన్ మిత్రులు చెప్పారు.
సముద్ర పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం సెయిల్ షిష్లు సుమారు 100 కేజీల వరకు బరువు పెరుగుతాయి. అలాగే 6 నుంచి 11 అడుగుల మధ్య పొడవు ఉంటాయి. పొడవైన ముక్కు కలిగి ఉంటాయి.