కీవ్, ఫిబ్రవరి 14: యూఎస్ఎస్ఆర్ మాజీ భాగస్వామి ఉక్రెయిన్ను మళ్లీ తనలో కలిపేసుకొనేందుకు రష్యా దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో ప్రపంచమంతా యుద్ధ భయం ఆవరించుకొంటున్నది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే సంభవిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని భయాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో ఉక్రెయిన్ చేరాలనుకోవటం, దాని వ్యతిరేకిస్తూ రష్యా యుద్ధానికి సిద్ధం కావటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని అన్ని దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఉక్రెయిన్ను రష్యా ఏ క్షణమైనా ఆక్రమించుకోవచ్చని అమెరికా హెచ్చరించటంతో అనేక దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కు రప్పిస్తున్నాయి. తాజాగా పలు దేశాలు ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులను కూడా రద్దుచేశాయి.
సరిహద్దుల్లో లక్షన్నర సైనికులు
ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా 1.3 లక్షల మంది సైనికులను మోహరించింది. భారీ ఆయుధాలను సరిహద్దులకు తరలిస్తున్నది. దీర్ఘకాలిక యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇటీవల నాటో, పలు యూరప్ దేశాలు విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైంది. మెరుపు దాడులు చేయగల 25 వేలమంది నౌకాదళ, వైమానిక దళ సైనికులను కూడా సిద్ధంగా ఉంచింది. ఉక్రెయిన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొన్న లుహాన్క్స్, డొనెస్క్స్ రిపబ్లిక్లలో రష్యా సైనికులు కనిపిస్తున్నారని రిపోర్టులు వెలువడుతున్నాయి. పొరుగునే ఉన్న మిత్రదేశం బెలారస్‌తో కలిసి రష్యా ఇటీవలే భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీనిపై బ్రిటన్, ఫ్రాన్స్ మండిపడ్డాయి. ఇది కచ్చితంగా యుద్ధ సన్నాహకమేనని బ్రిటన్ వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ కూడా యుద్ధానికి ఏర్పాట్లు చేసుకొంటున్నది. ఒడెసా ప్రాంతం నుంచి సైన్యాన్ని, ఎస్-300 విమాన విధ్వంసక క్షిపణులను డన్బాస్, బసరిన్ ప్రాంతాలకు తరలిస్తున్నది. క్రమటోర్క్స్ ఎయిర్‌బేస్‌ను జాయింట్ ఫోర్స్ ఆపరేషన్ కమాండ్ సెంటర్‌గా మార్చింది. యుద్ధం సంభవిస్తే ఉక్రెయిన్ తరఫున రంగంలోకి దిగేందుకు నాటో సిద్ధమవుతున్నది. ఇప్పటికే తన బలగాలను ఉక్రెయిన్ వైపు తరలించే ఏర్పాట్లు మొదలైనట్టు సమాచారం.
లేదు లేదంటూనే..
ఉక్రెయిన్ను రష్యా ఏ క్షణమైనా ఆక్రమించుకోవచ్చని అమెరికా భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ రెండురోజుల క్రితం ప్రకటించారు. గత శనివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటిస్తే కనీవినీ ఎరుగని ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమ దేశాల దూకుడు రాజకీయాలను సహించేదిలేదని రష్యా కూడా గట్టిగానే బదులిచ్చింది. తన ప్రయోజనాల రక్షణకు సంబంధించి గత డిసెంబర్లో అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) ముందు ఉంచిన 8 డిమాండ్లను ఆమోదించాల్సిందేనని స్పష్టంచేసింది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదన్నది ఇందులో ప్రధాన డిమాండ్. మరోవైపు రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, యూరప్ దేశాలు నిర్వహించిన సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని రష్యా విదేశాంగమంత్రి సెర్జీ లావ్రోవ్ పునరుద్ఘాటించారు. ఒక దేశం తన భూభాగంలో సైన్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తే ఇతర దేశాలతో యుద్ధానికి సిద్ధపడినట్టు కాదని వ్యాఖ్యానించారు.
పౌరుల తరలింపు
యుద్ధ మేఘాలు మరింత చిక్కనవుతున్న తరుణంలో ఉక్రెయిన్ నుంచి అనేక దేశాలు తమ పౌరులను వెనక్కు రప్పిస్తున్నాయి. అత్యవసర సిబ్బంది మినహా ఇతరులంతా స్వదేశం రావాలని ఫ్రాన్స్ తన పౌరులకు సూచించింది. బ్రిటన్‌తోపాటు మరికొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఇలాంటి హెచ్చరికలే జారీచేశాయి. ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులను కూడా కొన్ని దేశాలు రద్దుచేస్తున్నాయి. ఆరేండ్ల క్రితం ఉక్రెయిన్ గగనతలంలో మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్17 రష్యా తయారీ క్షిపణితో రెబల్స్ కూల్చేయటంతో అందులోని 298 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా అలాంటి దుర్ఘటనలు జరుగుతాయేమోనన్న భయంతో ఉక్రెయిన్ గగనతలం నుంచి వెళ్లరాదని చాలా దేశాలు తమ విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ గగనతలంలోకి వాణిజ్య విమానాలు ప్రవేశించకుండా ఆ దేశం ఆంక్షలు కూడా విధించింది. కీవ్ విమానాశ్రయాన్ని నాటో ఆధీనంలోకి తీసుకొన్నట్టు సమాచారం.