ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లోని ఓ చిన్న పిల్లల ఆస్పత్రిపై రష్యా సేనలు దాడులు చేశాయి. ఈ చిన్న పిల్లల ఆస్పత్రిపై రష్యా బాంబులు వేసి విధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సిటీ కౌన్సిల్ ప్రకటించింది. అయితే దీని నష్టం పెద్ద స్థాయిలో ఉండే అవకాశముందని సిటీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి ఎలా వుందన్న విషయం చెప్పడానికి కాస్త సమయం పడుతుందని పేర్కొంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల న్యూక్లియర్ ప్లాంట్‌లో కూలింగ్ వ్యవస్థలకు ప్రమాదం పొంచి ఉందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. పవర్ కట్ వల్ల అత్యవసర జనరేటర్లు ప్లాంట్‌కు బ్యాకప్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా తెలిపారు. ఈ డీజిల్ జనరేటర్లు కేవలం 48 గంటలపాటు మాత్రమే పని చేస్తాయని చెప్పారు. డీజిల్ లేక జనరేటర్లు పని చేయకపోతే కూలింగ్ వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. దీని వల్ల రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.