Russian oil tycoon | రష్యాలోని రెండో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ (Lukoil)లో అనుమానాస్పద మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా కంపెనీలో మరో కీలక అధికారి (Russian oil tycoon) ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ విటాలీ రాబర్టస్ (53) (Vitaly Robertus) తన కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మార్చి 12న రాబర్టస్ మరణించినట్లు రష్యన్ మీడియా నివేదించింది. తన కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. అయితే, అతడి మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
కొన్ని స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. రాబర్టస్ తన మరణానికి ముందు తలనొప్పిగా ఉందని, అందుకోసం మందులు అడిగినట్లు తెలిసింది. ఆ తర్వాత కార్యాలయంలోని తన గదిలోకి వెళ్లి అతడు ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులు రాబర్టస్ గదిలోకి వెళ్లి చూడగా.. అతడు ఉరేసుకొని శవమై కనిపించాడు. రాబర్టస్ లుకోయిల్ సంస్థలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది.
కాగా, ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ( Ukraine war) మొదలైన నాటి నుంచి లుకోయిల్ సంస్థలో ఇది నాలుగో అనుమానాస్పద మరణం. అంతకుముందు మే 2022లో లుకోయిల్ టాప్ మేనేజర్ 43 ఏళ్ల అలెగ్జాండర్ సుబోటిన్ మైటిష్చి పట్టణంలోని తన ఇంటి బేస్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 2022లో కంపెనీ మాజీ చైర్మన్ రవిల్ మగవోవ్ (67) మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్లో కిటికీ నుండి పడి మరణించాడు. అప్పుడు కూడా అతడి మరణానికి గల కారణాలు తెలియలేదు. 2023 అక్టోబర్‌లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ వ్లాదిమిర్ నెక్రాసోవ్ గుండెపోటుతో మరణించాడు.
వీరే కాదు రష్యాలో పుతిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన అనేకమంది రష్యా రాజకీయ నాయకులు, బిలియనీర్లు, పారిశ్రామికవేత్తలు, రిపోర్టర్లు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి సుమారుగా 20 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read..
Gaza | ఆహారం కోసం వేచిచూస్తున్న వారిపై కాల్పులు.. 29 మంది మృతి
Palestine | యుద్ధం వేళ పాలస్తీనాకు కొత్త ప్రధాని.. సలహాదారుడినే పీఎంగా నియమించిన అధ్యక్షుడు
Mamata Banerjee | నుదుటిపై మూడు కుట్లు.. నిలకడగానే దీదీ ఆరోగ్యం : అధికారులు