మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) కీలక ప్రకటన చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధ జలాంతర్గాములను .. విదేశీ రేడార్లు గుర్తించలేవన్నారు. ఆర్కిటిక్ మంచు ఫలకాల కింద ప్రయాణించే తమ సబ్మెరైన్లను గుర్తించే సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. సరోవ్‌లో జరిగిన కార్యక్రమంలో న్యూక్లియర్ సెక్టర్ వర్కర్లతో మాట్లాడారు. రష్యా రక్షణ అంశంలో ఆర్కిటిక్ ప్రాంతం అత్యంత కీలకమైందని పుతిన్ పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న వ్యూహాత్మక న్యూక్లియర్ సబ్మెరైన్లు.. ఆర్కిటిక్ ఐస్ కిందకు కూడా వెళ్లగలవని, అవి రేడార్ల నుంచి తప్పించుకుంటాయని, ఇది తమ మిలిటరీ సాధించిన ఘనత అని పుతిన్ అన్నారు.
ఆర్కిటిక్ ప్రాంతంలో కొనసాగుతున్న పరిశోధనలు కీలకమైనవన్నారు. అయితే ఆర్కిటిక్‌లో మంచు కరుగుతున్న కారణంగా.. షిప్పింగ్ రూట్లు ఇప్పుడు మరింత ఎక్కువ యాక్సిస్‌లోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. చాలా వరకు దేశాలు ఇప్పుడు ఆర్కిటిక్ దారిని వాడాలని చూస్తున్నాయని, అలాంటి సమయంలో తమకు అడ్వాంటేజ్ అవుతుందని ఆయన అన్నారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఐస్‌బ్రేకర్ సబ్మెరైన్లు రష్యా వద్దే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశం మాత్రమే వీటిని ఆపరేట్ చేస్తున్నది.
2000 నుంచి రష్యా 8 బోరై క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్లను నిర్మించింది. తాజాగా కిన్యాజ్ పోజర్స్కీ సబ్‌మెరైన్‌ను ఆవిష్కరించింది. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. తమ జలాంతర్గాముల్లో బులావా బాలిస్టిక్ క్షిపణులను వాడుతున్నట్లు పుతిన్ తెలిపారు. ఆ మిస్సైల్ రేంజ్ సుమారు 8 వేల కిలోమీటర్లు ఉంటుంది.