కీవ్, ఫిబ్రవరి 14: ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని చెర్నోబిల్ అణు విద్యుత్తు కర్మాగారానికి చెందిన రియాక్టర్ రక్షణ కవచంపై రష్యా డ్రోన్ దాడి జరిపినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం ప్రకటించారు. దీని వల్ల మంటలు చెలరేగగా అక్కడి సిబ్బంది వెంటనే ఆర్పివేశారని ఆయన చెప్పారు. ఈ దాడి కారణంగా రేడియేషన్ స్థాయి పెరగలేదని జెలెన్స్కీ తెలిపారు.
ఐక్య రాజ్య సమితి(యూఎన్)కి చెందిన అణు సంస్థ స్పందిస్తూ చెర్నోబిల్ అణు విద్యుత్తు కర్మాగారం వద్ద ఉన్న తమ సిబ్బంది పేలుడు శబ్దం విన్నారని, రక్షణ కవచంపై డ్రోన్ దాడి జరిగిందన్న సమాచారం వారికి అందిందని తెలిపింది. అయితే ఈ దాడికి రష్యా పాల్పడినట్టు సంస్థ వెల్లడించలేదు. కాగా, జెలెన్స్కీ ఆరోపణలను రష్యా ఖండించింది.