కీవ్: రష్యా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య, ఫస్ట్ లేడీ ఒలినా జెలెన్స్కా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. దేశ ప్రజలపై సామూహిక హత్యలకు రష్యా పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. రష్యా జరిపిన దాడుల్లో చిన్నారులు మృతిచెందినట్లు ఆమె తెలిపారు. బాంబు దాడుల్లో మృతిచెందిన ముగ్గురు చిన్నారుల పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. ఉక్రెయిన్‌కు శాంతి కావాలని, దేశ సరిహద్దుల్ని రక్షించుకుంటామని, తమ ఐడెంటీని కోల్పోమన్నారు. ప్రస్తుతం జెలెన్స్కా ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ రష్యా తమ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి వెబ్సైట్లో జెలెన్స్కా తన స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు. ఇంటర్వ్యూల కోసం చాలా అభ్యర్థనలు వచ్చాయని, కానీ ఈ లేఖతో తాను సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు. రష్యా చేపట్టిన ఆక్రమణను నమ్మలేకపోతున్నామని, మా దేశం ప్రశాంతంగా ఉందని, నగరాలు.. పట్టణాలు.. గ్రామాల్లో జీవితాలు సాఫీగా సాగుతున్నాయన్నారు. కానీ మన ప్రజల్ని రష్యా మర్డర్ చేస్తోందన్నారు. రష్యా చేపట్టిన దాడిలో చిన్నారుల బలవుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.