న్యూయార్క్: రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై (Kremlin) డ్రోన్ దాడి అమెరికా పనే అని ఆరోపించడాన్ని వైట్‌హౌస్ (White House) కొట్టిపారేసింది. ఇది హాస్యాస్పదమని (Ludicrous) యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బే (John Kirby)చెప్పారు. రష్యా (Russia) ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉక్రెయిన్ తన సరిహద్దుల అవతల దాడులు చేయడాన్ని అమెరికా ఎప్పటికీ ప్రోత్సహించదని అమెరికా అధ్యక్షభవనం ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియర్ వెల్లడించారు. కాగా, క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి వెనుక ఎవరున్నారనే విషయాన్ని కనుక్కోవడానికి యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు యత్నిస్తున్నారని చెప్పారు. అయితే ఇది నిజంగానే జరిగిందా లేదా సానుభూతి కోసం రష్యాయే నాటకమాడుతున్నదనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
రెండు రోజుల క్రితం రష్యా రాజధాని మాస్కో నగరం నడిబొడ్డున ఉన్న క్రెమ్లిన్ భవనాలపైకి రెండు డ్రోన్లు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి యత్నం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాలో ఎక్కడెక్కడ దాడి చేయాలనే విషయాలను ఉక్రెయిన్‌కు అమెరికా చెబుతోందని, అమెరికా సూచన మేరకు ఉక్రెయిన్ నడుచుకుంటోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఆరోపించారు.
ఉక్రెయిన్ తీరు మారకపోతే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అతని బృందాన్ని హతమార్చడం తప్ప తమకు మరో అవకాశం లేదని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మెద్వెదేవ్ ప్రకటించారు. లొంగిపోతామనే ప్రకటన పత్రంపై వారు సంతకం కూడా చేయాల్సిన అవసరం లేదని, జర్మనీ నియంత హిట్లర్ కూడా అలాగే చేశాడని, ఆయనకు ఎల్లప్పుడూ కొందరు ప్రత్యామ్నాయంగా ఉంటారని మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు. క్రెమ్లిన్‌పై జరిగిన దాడి రష్యా సమాజంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ముందు జాగ్రత్త చర్యగా పుతిన్‌ను సమీప బంకర్‌కు తరలించారు.