రష్యా సైనిక బలగాలకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో చూపించిన తెగువ ప్రశంసనీయమన్నారు. సాయుధ బలగాలు, స్పెషల్ ఆపరేషన్ బలగాలకు పుతిన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మాతృభూమి పట్ల విధేయతను చూపించిన సాయుధ బలగాలకు, స్పెషల్ బలగాలకు, ఆర్మీ అధికారులకు అందరికీ ధన్యవాదాలు. ప్రమాణాల ప్రకారం అత్యంత విధేయత చూపించి, మాతృభూమికి సేవలు చేసినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా భద్రతా బలగాలు ప్రవేశించాయన్న వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం స్పందించింది. కీవ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ఉక్రెయిన్ డిప్యూటీ హెడ్ అడ్మినిస్ట్రేషన్ మైకోలా పోవోరోజ్నిక్ ప్రకటించారు. కీవ్‌లో పరిస్థితి చాలా ప్రశాంతంగానే వుంది. రాజధాని మొత్తం ఉక్రెయిన్ ఆర్మీ దళాల ఆధీనంలోనే ఉంది. పరిస్థితి పూర్తిగా మా అదుపులోనే ఉంది అని డిప్యూటీ హెడ్ అడ్మినిస్ట్రేషన్ మైకోలా పోవోరోజ్నిక్ ప్రకటించారు. అలాగే.. తమపై దాడులు చేయడానికి వచ్చిన రష్యా దళాలను ఉక్రెయిన్ ఆర్మీ అదుపులోకి తీసుకుందని కూడా ఆయన ప్రకటించారు.