మాస్కో : ఉక్రెయిన్‌లోని రష్యా – క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై పేలుడు ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దర్యాప్తు అధికారులతో సమావేశం నిర్వహించారు. దర్యాప్తు కమిటీ చైర్మన్ అలెగ్జాండర్ బాస్ట్రికిన్తో చర్చించిన పుతిన్.. వంతనపై పేలుడు ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ మొత్తం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసి.. ఘటనకు పాల్పడిందని ఆరోపించారు. పౌర మౌలిక సదుపాయాలను ధ్వంసమే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంతెనపై దాడి వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక బలగాల హస్తం ఉందని, ఉక్రెయిన్ టర్కిష్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేసేందుకు కూడా ప్రయత్నించినట్లు క్రెమ్లిన్ ఆరోపించింది. రష్యా ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు కొనసాగితే.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. పుతిన్ సోమవారం రష్యా భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ దాడికి కారణమైన ఉగ్రవాదులను హతమార్చాలన్నారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం ప్రారంభించిన భారీ క్షిపణి దాడిని రష్యా ప్రత్యేక సైనిక చర్యలో భాగంగా నిర్వహిస్తున్నట్లు క్రెమ్లిన్ పేర్కొన్నట్లు ఏటీఎఫ్ తెలిపింది. శనివారం రష్యా – క్రిమియాను కలిపే ఏకైక వంతనపై పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న వాహనాలు, చమురు ట్యాంకులలతో పాటు రైళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే.
క్రిమియాను 2014లో రష్యా ఆధీనంలోకి తీసుకుంది. ఈ వంతెన ద్వారా ఉక్రెయిన్‌పై జరుగుతున్న సైనిక చర్యలకు సంబంధించి సైనిక సామగ్రిని పంపుతున్నది. ఈ వంతెన కెర్చ్ జలసంధిపై ఉండగా.. ఈ వంతెనను రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018లో ప్రారంభించారు. కెర్చ్ వంతెనపై పేలుడు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు భద్రతను కట్టుదిట్టం చేశారు. పర్యవేక్షణ బాధ్యతలను సెక్యూరిటీ సర్వీస్‌కు అప్పగించారు. క్రిమియా వంతెన కోసం భద్రతా చర్యలను పెంచే ఉత్తర్వుపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. రష్యాతో క్రిమియాను కలిపే ఎనర్జీ బ్రిడ్జ్ అండ్ గ్యాస్ పైప్‌లైన్‌కు భద్రత కల్పించాలని ఆదేశించారు.