కీవ్: ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం కోసం రష్యా తన సైనికులకు వయాగ్రా ఇస్తున్నదని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రతినిధి ఆరోపించారు. బాధితులను అమానవీయంగా మార్చే ఉద్దేశపూర్వక వ్యూహమని విమర్శించారు. లైంగిక హింసపై యూఎన్ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్, ఏఎఫ్పీ వార్తా సంస్థకు శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల అత్యాచారాలు ఆ దేశ సైనిక వ్యూహంలో ఒక భాగమని ఆమె ఆరోపించారు. రష్యా సైనికుల వద్ద వయాగ్రా మాత్రలు ఉన్నట్లు బాధిత ఉక్రెయిన్ మహిళలు సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఇది స్పష్టమవుతున్నదని అన్నారు. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేయాలని తన సైన్యానికి రష్యా చెప్పడంతోపాటు దీని కోసం వారికి వయాగ్రా మాత్రలు కూడా ఇచ్చిందని ఆమె దుయ్యబట్టారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్పై రష్యా దాడి ఇంకా కొనసాగుతున్నది. రష్యా, క్రిమియాను కలిపే వంతెనను ఇటీవల పేల్చివేశారు. ఈ చర్యను ఉగ్రవాద దాడిగా రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై దీర్ఘ శ్రేణి క్షిపణులతో దాడులు చేస్తున్నది.