మాస్కో: భారత్‌లో ఉగ్ర దాడికి ఐఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కీలక నేత హత్యకు ప్లాన్ చేసింది. దీని కోసం ఒక సూసైడ్ బాంబర్‌ను రంగంలోకి దించింది. అయితే ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా తెలిపింది. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) ఈ మేరకు సోమవారం ప్రకటించింది. రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) గుర్తించి, నిర్బంధించినట్లు తెలిపింది. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందినవాడని పేర్కొంది. ఆ ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుని భారత్‌లో అధికారంలో ఉన్న కీలక రాజకీయ నేతను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఎఫ్ఎస్బీ నిర్బంధించిన ఆ వ్యక్తిని ఆత్మాహుతి బాంబర్‌గా టర్కీలో ఐఎస్ఐఎస్ రిక్రూట్ చేసినట్లు వివరించింది.
కాగా, భారత్‌లో కూడా తన ఉనికిని చాటేందుకు ఐఎస్ఐఎస్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నది. అలాగే సోషల్ మీడియా ద్వారా తన సిద్ధాంతాన్ని వ్యాపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సైబర్ యాక్టివిటీపై నిఘా పెట్టాయి. మరోవైపు ఐఎస్ఐఎస్తోపాటు దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ ఉగ్రవాద సంస్థలను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని మొదటి షెడ్యూల్లో చేర్చింది.