Antarctica | న్యూయార్క్, డిసెంబర్ 31: మంచు ఖండం అంటార్కిటికాపై రష్యా కన్నేసింది. అక్కడ నిక్షిప్తమై ఉన్న అపారమైన చమురు నిక్షేపాలను వెలికితీసి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా ఎదగాలని భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది. రష్యా చర్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్యా ప్రయత్నాలు ప్రపంచ దేశాల మధ్య వివాదానికీ కారణమయ్యే ప్రమాదం ఉంది. అంటార్కిటికాలో దాదాపు 51 వేల కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయని రష్యా జియాలజిస్టులు ఇప్పటికే గుర్తించారు. అయితే, చమురు నిక్షేపాలు గుర్తించిన ప్రాంతం తమదని యూకే ప్రకటించింది. యూకేతో పాటు రష్యా, చిలీ, అర్జెంటీనా వంటి ఏడు దేశాలు అంటార్కిటికాలో తమ భూభాగాలు ఉన్నాయని చెప్తున్నాయి. దీంతో ఇక్కడ చమురును వెలికితీసేందుకు రష్యా చేసే ప్రయత్నాలు ఈ దేశాల మధ్య వివాదంగా మారే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ చమురు నిక్షేపాలను కనుక వెలికితీస్తే ఒపెక్ దేశాలను దాటి చమురు రంగంలో ప్రధాన శక్తిగా రష్యా ఎదిగే అవకాశముంది. అంటార్కిటికాలో అపారమైన వనరులు ఉన్న నేపథ్యంలో ఈ ఖండాన్ని రక్షించేందుకు 1959లోనే అంటార్కిటిక్ ట్రీటి పేరుతో ఒప్పందం జరిగినప్పటికీ రష్యా పాటిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచంలో మానవ మనుగడ తక్కువగా ఉన్న ఖండం అంటార్కిటికా.
అయితే, మిగతా ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణానికి హాని కలిగించే చర్యల వల్ల ఇప్పటికే అంటార్కిటికాకు ముప్పు వాటిల్లుతున్నది. ఇక్కడి మంచు వేగంగా కరిగి సముద్ర మట్టం పెరుగుతున్నది. ఇప్పుడు ఏకంగా అంటార్కిటికా నుంచి చమురు వెలికితీయాలనే రష్యా ప్రయత్నాలు ఈ ఖండానికి మరింత నష్టం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది చివరకు యావత్ ప్రపంచానికే నష్టం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చందమామపై కాలు పెట్టాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తుండగా, ఇంకొన్ని దేశాలు ఏకంగా చంద్రుడిపై మైనింగ్ అవకాశాలను అన్వేషిస్తున్నాయి. చంద్రుడిలో అనేక అరుదైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ దశాబ్దం చివరి కల్లా చంద్రుడిపై మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని పలు దేశాలు, ప్రైవేటు కంపెనీలు భావిస్తున్నాయనే చర్చ జరుగుతున్నది.
ఈ ప్రయత్నాలపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రుడిపై మైనింగ్ చేయడం వల్ల భారీగా దుమ్ము రేగుతుంది. ఈ దుమ్మును నెమ్మదించే వాతావరణం చంద్రుడిపై లేనందున చాలా దూరం ప్రయాణించే ప్రమాదం ఉందని, తద్వారా అంతరిక్ష ప్రయోగాలకు ముప్పుగా మారొచ్చనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై పర్యావరణ వ్యవస్థలు, అలలు, జీవ మనుగడను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.