మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి (Corona in Russia) జోరు ఏమాత్రం తగ్గలేదు. అక్కడ ఇప్పటికీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజూ 30 వేల దరిదాపుల్లోనే కొత్త కేసులు ఉంటున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 30,288 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అక్కడి ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,86,967కు పెరిగింది. రష్యా ఫెడరల్ రెస్పాన్స్ సెంటర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.
ఇక రష్యా రాజధాని మాస్కోలో గడిచిన 24 గంటల్లో 3,140 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్‌లో 2,045 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇదిలావుంటే ఇవాళ కొత్తగా 1,171 మంది కరోనా బాధితులు మరణించడంతో రష్యాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,88,351కి చేరింది. కాగా, ఇవాళ 36,446 మంది కరోనా బాధితులు ఆ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 87,09,964కు చేరింది.