న్యూఢిల్లీ, మార్చి 31: ఏడాది కాలంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ రెండుసార్లు దాడి చేశాయి. ఈ రెండు దాడులకు మూల కారణం ఇరాన్‌కు అణ్వాయుధాలను తయారుచేయగల సామర్థ్యం ఉండడమే. దీన్ని అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఇరాన్లో ఇప్పుడు ఐదవ వారంలోకి ప్రవేశించిన, ముగింపు కనిపించని సైనిక దాడి ప్రపంచవ్యాప్తంగా అణు పోటీ అనే భూతాన్ని చెరవిముక్తి చేసినట్లుగా కనిపిస్తున్నది. పాలన మార్పు, అణు కార్యక్రమం ముగింపును తెచ్చే ఉద్దేశంతో ఇరాన్‌పై జరిగిన దాడులు యూరప్ నుంచి తూర్పు ఆసియా వరకు అన్ని దేశాలు ఇప్పుడు తమ అణు విధానంపై పునరాలోచించే పరిస్థితిని కల్పించాయి. శక్తివంతమైన మిత్రదేశాలపై ఆధారపడే బదులు సొంతంగా అణ్వాయుధాలు నిర్మించుకోవాలని చాలా దేశాలు యోచిస్తున్నాయి.
ఒకప్పుడు అమెరికా అణు ఛత్రం కింద తాము సురక్షితమని భావించిన దేశాలు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ పాలనలో అమెరికా తీసుకునే నిర్ణయాలు అనూహ్యంగా ఉన్న నేపథ్యంలో సొంత ప్రత్యామ్నాయాలపైనే ఆధారపడేందుకు మొగ్గుచూపుతున్నాయి. అణ్వాయుధాల దాడికి గురైన ఏకైక దేశమైన శాంతికాముక జపాన్ సైతం ఇప్పుడు సొంతంగా అణ్వాయుధాల నిర్మాణం గురించి ఆలోచిస్తున్నది. చైనా, రష్యాతో పోటీపడాలని అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో 33 ఏండ్ల విరామం తర్వాత తాను కూడా అణు పరీక్ష పునరుద్ధరించాలన్న ఆసక్తిని గత నవంబర్‌లో అమెరికా వ్యక్తం చేసింది.
ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించుకుంటే తాము కూడా అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధిస్తామని సౌదీ అధికారులు చాలాకాలంగా చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్, సౌదీ ఓ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తమ అణ్వయుధాలు అవసరమైతే సౌదీకి కూడా అందుబాటులో ఉంటాయని పాక్ ఆ తర్వాత ప్రకటించింది. మరో పక్క నాటో సభ్య దేశమైన తుర్కియే తన సొంత అణు నిరోధక శక్తి కోసం అన్వేషిస్తున్నది. ఇరాన్ మరింత బలపడితే ఈ ప్రాంతంలోని అధికార సమతుల్యతను దెబ్బతీస్తుందన్న భయమే తుర్కియే ఆందోళనకు కారణం.
లిబియా, ఉక్రెయిన్ విషయంలో చూసినట్లుగా అణ్వాయుధ కవచం లేని దేశాలు దాడుల నుంచి అధిక ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటాయో ఇరాన్‌పై జరిగిన దాడి తెలియచేస్తుంది. అణ్వాయుధాలు కలగి ఉండటం ఇంటి గేటు దగ్గర ఒక డాబర్మాన్ శునకాన్ని కాపలాగా ఉంచుకోవడం లాంటిది. చొరబాటుదారులను భయపెట్టి తరిమివేయడానికి అది బాగా పనిచేస్తుంది. అణ్వాయుధాల నిల్వలను కలిగి ఉన్న ఉత్తర కొరియా సరిగ్గా ఇదే కారణంతో బాహ్య జోక్యాన్ని చాలా వరకు నిరోధించగలిగిందని నిపుణులు తెలిపారు.
