జెనీవా: కొత్త కరోనా వేరియంట్ B.1.1.529(ఒమిక్రాన్)తో రిస్క్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఆ వైరియంట్ పట్ల ప్రపంచ దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో భయానక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆ వేరియంట్ వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పింది. అయితే ఆ వేరియంట్ వ్యాప్తిస్తున్న తీరు, అది ఎంత ప్రమాదకరమన్న విషయం అస్పష్టంగా ఉన్నట్లు కూడా డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒకవేళ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వైరస్ హెచ్చు స్థాయిలో ప్రబలితే, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో తన టెక్నికల్ నోట్లో తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల మరణాలు రికార్డు కాలేదు.
🆕 Technical paper on the #COVID19 variant of concern, Omicron. It includes a set of preparedness actions for countries ⬇️ https://t.co/SH1VGbuoka
— World Health Organization (WHO) (@WHO) November 29, 2021
B.1.1.529 వేరియంట్‌ను ఆందోళనకరమైందిగా నవంబర్ 26వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు ఇచ్చిన సూచన మేరకు ఆ వేరియంట్‌కు ఒమిక్రాన్ అని నామకరణం చేశారు. ఒమిక్రాన్‌లో మ్యుటేషన్లు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. సుమారు 26 నుంచి 32 వరకు స్పైక్ ప్రోటీన్లు పరివర్తనం చెందుతున్నట్లు గుర్తించారు. దీని వల్ల ఇమ్యూనిటీకి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాప్తి కూడా ఎక్కువ రేంజ్ ఉంటుందన్నారు.