Neuroticism | లండన్, అక్టోబర్ 23: సినిమాలు చూసి ఏడ్చేవారు, తిరస్కరణకు గురవుతామనే భయం ఉన్న వారు, సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావించే వారికి అకాల మరణ ముప్పు ఎక్కువ ఉన్నట్టు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. న్యూరోటిసిజంతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయని, వీరిలో అకాల మరణ ముప్పు 10 శాతం ఎక్కువ ఉంటుందని తేలింది. న్యూరోటిసిజం సమస్యతో బాధపడుతున్న యూకే బయోబ్యాంక్ డాటాలో ఉన్న ఐదు లక్షల మంది 17 ఏండ్ల జీవితాన్ని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. న్యూరోటిసిజం కూడా దుఃఖం, భయం, చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలకు సంబంధించినది.
ఈ సమస్య ఉన్నవారిలో ఆందోళన, ఒంటరితనం, విరక్తి వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. ఇవి మనిషి మెదడు, శరీరంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒంటరితనం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు పెరగడంతో పాటు తమకు తాము హాని తలపెట్టుకోవాలనే ఆలోచనలు పెరుగుతాయని తెలిపారు. న్యూరోటిసిజం ఎదుర్కొంటున్న వారిలో మూడ్ స్వింగ్స్, విసిగిపోయిన భావన కలుగుతాయని, ఇవి కూడా అకాల మరణ ముప్పును పెంచుతాయని పేర్కొన్నారు. న్యూరోటిసిజంలోని ఇతర సమస్యల కంటే ఒంటరితనం అనేది ఎక్కువగా ప్రభావం చూపుతున్నదని ప్రొఫెసర్ ఆంటోనియో టెర్రాసియానో తెలిపారు.