Prostate Cancer | న్యూఢిల్లీ: ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అపాయింట్మెంట్లను తరచూ ఎగ్గొట్టే పురుషులు అదే వ్యాధితో మరణించే ముప్పు 45 శాతం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరించారు. యూసీ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) ప్రకారం.. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ అత్యంత సాధారణమైన క్యాన్సర్. క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రొస్టేట్ క్యాన్సర్ రెండో ప్రధాన కారణం. యూరోపియన్ యూనియన్‌లోని ఫిన్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్, బెల్జియం, స్పెయిన్ దేశాల నుంచి సమాచారాన్ని ఈ అధ్యయనంలో వినియోగించారు.
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అధ్యయనం. నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ ఎంసీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, స్క్రీనింగ్స్‌లో పాల్గొనాలని 72,460 మంది పురుషులను ఆహ్వానించారు. అయితే, ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ స్క్రీనింగ్ అపాయింట్మెంట్లకు గైర్హాజరయ్యారు. స్క్రీనింగ్‌కు సక్రమంగా హాజరైనవారు, ఎగ్గొట్టినవారు ప్రొస్టేట్ క్యాన్సర్‌తో మరణించే ముప్పును విశ్లేషించినపుడు, ఎగ్గొట్టినవారికి 45 శాతం ఎక్కువ మరణ ముప్పు ఉన్నట్లు వెల్లడైంది.